వట్టి చేతులతో తిరిగి వస్తే అంతే: టి-ఎంపీలకు హరీష్ రావు హెచ్చరిక
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెస్తామని న్యూఢిల్లీ వెళుతున్న ఎంపీలు వట్టి చేతులతో తిరిగి రావద్దని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గురువారం తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. వారు తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వైఖరితో తిరిగి రావాన్నారు. లేదంటే వారు తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మూడు రోజులు దీక్ష చేసి విద్యార్థులపై ఒక్క కేసును కూడా ఎత్తి వేయించ లేక పోయారని ఆరోపించారు.
కాగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో మంత్రి లేక పోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లుగా మార్చి వేసిందని ఆరోపించారు. విత్తన సరఫరా కేంద్రాల్లో రైతులు బారులు తీరినా విత్తనాలు సరఫరా కావడం లేదన్నారు. విత్తనాల కోసం శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.