నేను చంద్రబాబులా కాదు, విచారణ జరిపించుకోండి: బొత్స
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడులా స్టే తెచ్చుకోలేదని ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. తెలుగుదేశం పార్టీ మేథో మధనం కార్యక్రమంలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలపై బొత్స స్పందించారు. తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తనపై బాబు చేసిన మద్యం సిండికేట్ల విచారణకు తాను సిద్ధం అని అన్నారు. గతంలో చంద్రబాబుపై మద్యం సిండికేట్ వ్యవహారంలో ఆరోపణలు వస్తే ఆయన కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
తాను చంద్రబాబులా స్టే తెచ్చుకోనని అన్నారు. తన నిజాయతీని నిరూపించుకుంటానని అన్నారు. గతంలో వ్యోక్స్ వ్యాగన్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు తాను పూర్తిగా సహకరించానని అన్నారు. హైకోర్టు ఎన్నికలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేస్తామని చెప్పారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలపై తాను ఏమీ స్పందించనన్నారు. ఓ నియామకం జరిగినప్పుడు ఇలాంటి విమర్శలు సహజమే అన్న విధంగా బొత్స స్పందించారు.