హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మునిగిపోతున్న పడవ అని, దానిని నూతనంగా ఎన్నికైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రక్షించలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మంగళవారం అన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ బొత్సపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అంతర్గత విషయాలని దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అతి సున్నితమైన ఈ అంశంపై కేంద్రం తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా నిర్ణయంపై ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ సమావేశాల్లో చర్చించలేదని అన్నారు. అయితే స్థానికంలో తమ పొత్తులు తమ ప్రాతినిథ్యం పెంచుకునే విధంగా ఉంటాయని అన్నారు. స్థానిక సంస్థల్లో బలం ఉన్న చోటే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు కలవాలన్న ప్రతిపాదనకు కాలం చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో కలిసి విడిపోయాయని అన్నారు. వామపక్షాల విలీనం ముఖ్యం కాదన్నారు. ఐక్యం కావడం మంచిదే అయినప్పటికీ కలిశాక పోట్లాడుకోవడం మంచిది కాదన్నారు.