ప్రణబ్‌తో భేటీ తర్వాత రాజీనామాల బాటలో తెలంగాణ ప్రజాప్రతినిధులు?

ప్రణబ్ ముఖర్జీతో భేటీ తర్వాత అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నప్పటికీ ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. వారు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రణబ్‌తో సమావేశం కానున్నారు. రాజీనామాల ఆలోచన లేదని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అంటున్నట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేయబోమని, సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధిస్తామని రాష్ట్ర మంత్రి పి. శంకర రావు అంటున్నారు. చిదంబరంతో భేటీ తర్వాత ప్రణబ్ ముఖర్జీతో ఏం చర్చించాలనే విషయంపై కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు చర్చించారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చకు వెళ్లాల్సి ఉన్నందున చిదంబరం ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారని హనుమంతరావు చెబుతున్నారు.
చిదంబరంతో భేటీపై మీడియాతో ఏం చెప్పాలనే విషయంపై రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు, రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి మల్లగుల్లాలు పడ్డారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తారని ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం సాగదీయాలనే పార్టీ అధిష్టానం వ్యూహం ప్రకారమే వీరు నడుచుకుంటున్నట్లు భావిస్తున్నారు.