చిరంజీవికి విమర్శించే అర్హత లేదు: జగన్ వర్గం శోభానాగిరెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని పిఆర్పీ జగన్ వర్గం శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి శనివారం అన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి సంతకాలు సేకరించడానికి చిరంజీవి వద్దకు ఎవరు వచ్చారో ఆయన బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీలోని వారందరం రాజీనామాలు చేసి తాము దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటోతో చిరంజీవి వర్గం వారు చిరు, సోనియా ఫోటోతో పోటీ చేయడానికి సిద్ధమని అన్నారు. దానికి వారు సిద్దమా అని సవాల్ విసిరారు.
పదవుల కోసం ప్రజల నమ్మకాన్ని నట్టేట ముంచిన చిరంజీవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. చిరంజీవి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతే, ప్రజల కోసం జగన్ పదవులను తృణప్రాయంగా త్యజించారన్నారు. ప్రజారాజ్యం పార్టీ అవినీతి కోసమే పుట్టిందని, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు ఆరోపించారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు చేసేముందు ప్రజారాజ్యం పార్టీ ప్రస్థాన ప్రహసనాన్ని ఒకసారి అవలోకించుకోవాలని హితవు పలికారు.