తెలంగాణ సిద్ధాంతకర్త, పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ కన్నుమూత

ఆయన పదేళ్ల వయస్సు నుంచి తెలంగాణ కోసం పోరాడుతున్నారు. 1952లో ఆయన నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు. సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. మొదటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. తెరాసను ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కెసిఆర్‌కు సలహాదారుగా, మార్గదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అన్ని క్లిష్ట సమయాల్లో ఆయన కెసిఆర్‌కు తన తోడ్పాటు అందించారు.
ఆయన హనుమకొండలో బిఇడి చేశారు. అలీగడ్, బెనారస్ విశ్వవిద్యాలయాల నుంచి అర్థశాస్త్రంలో పట్టా పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని వరంగల్‌లోని ఏకశిలా పార్కులో ఉంచుతారు. జయశంకర్ మృతికి తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ సంతాపం ప్రకటించారు. జయశంకర్ మృతి తెలంగాణ ఉద్యమానికి పెద్ద లోటు. కెసిఆర్‌కు వ్యక్తిగతంగా తీవ్ర నష్టమే.












Click it and Unblock the Notifications