మృతదేహం వద్ద రాజకీయాలా, కడసారి చూడలేకపోయాం: ఎర్రబెల్లి ఆవేదన
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తమను తెలంగాణ రథ సారధి ఆచార్య జయశంకర్ భౌతికాయం దగ్గరకు వెళ్లకుండా కొందరు రాజకీయం చేసి అడ్డుకున్నారని తెలంగాణ టిడిపి ఫోరం అధ్యక్షుడు, సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. తమకు చివరి చూపు లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహం వద్ద కూడా రాజకీయాలు చేయడం తగదని ఆయన సూచించారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నదే జయశంకర్ ఆకాంక్ష అని అందుకు అనుగుణంగా అందరితో కలిసి పని చేయడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
జయశంకర్ మృతి కారణంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మూడు రోజుల సంతాపదినంగా ప్రకటించిందని కాబట్టి తాను తలపెట్టిన ఆందోళనలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సంతాప దినాలు కొనసాగుతున్నందున ఆందోళనలు ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని 25 తారీఖున ఆందోళనలు చేపడతామని చెప్పారు. కాగా 23, 24 తేదీలలో టిడిపి ఆందోళనలు తలపెట్టనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.