హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో తనకు పరిచయం ఉందని ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ సిఐడి పోలీసుల విచారణలో వెల్లడించారు. భానుతో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే అని అయితే మద్దెలచెర్వు సూరి హత్యతో మాత్రం తనకు సంబంధం లేదని చెప్పారు. సూరి హత్య అనంతరం భాను ఎక్కడకు వెళ్లాడో తనకు తెలియదని శింగనమల చెప్పారు. కాగా సిఐడి పోలీసులు శింగనమలను సుమారు 4 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పలు ముఖ్యమైన విషయాలు వారికి తెలిసినట్లుగా తెలుస్తోంది.
శింగనమల నుండి పోలీసులు 20 సిమ్ కార్డులు, ఒక హార్డు డిస్క్, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భాను, రమేష్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు కూడా శింగనమల పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా భాను ఎక్కడున్నాడు శింగనమలకు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం నాంపల్లి కోర్టులో శింగనమలను పోలీసులు హాజరు పరుచనున్నారు.