హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు హైదరాబాద్ దెబ్బ చూపిస్తామని మంత్రి ముఖేష్ గౌడ్ మంగళవారం హెచ్చరించారు. మెట్రో రైలు నిర్మిస్తే కాంగ్రెసు ప్రభుత్వానికి తెలంగాణ దెబ్బ చూపిస్తాని కెసిఆర్ అంటే మెట్రో రైలు అడ్డుకుంటే కెసిఆర్‌కు తాము గ్రేటర్ హైదరాబాద్ దెబ్బ రుచి చూపిస్తామని అన్నారు. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఉంటూనే నగరం అభివృద్ధికి అడ్డుపడే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. మెట్రో రైలును అడ్డుకుంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి డెడ్ లైన్లు పెడితే మేం చేయాల్సిన అవసరం లేదన్నారు. డెడ్ లైన్లు పెట్టడానికి అసలు జెఏసి ఎవరన్నారు. తాము డెడ్ లైన్లు పెడితే కెసిఆర్ కుటుంబ సభ్యులు బయటకు రాలేరని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య జయశంకర్‌కు పేరు లేకుండా కెసిఆర్ చేశారన్నారు. కోదండరాంను తీసుకు వచ్చి జెఏసి చైర్మన్‌పై కూర్చుండ బెట్టి తనకు అనుగుణంగా కెసిఆర్ మలుచుకున్నారన్నారు.