హైదరాబాద్: డబ్బు సంపాదించడం కోసం వరుస పెళ్లిళ్లు చేసుకొని యువకులను మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీని సిఐడి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డబ్బు కోసం, జల్సాల కోసం యువకులను వివాహం పేరుతో ఎర వేసేది. హైదరాబాదుకు చెందిన దీప్తీ అలీయాస్ దీప్తిరెడ్డి అలియాస్ దీప అనే 25 ఏళ్ల యువతి గత కొన్నాళ్లుగా దీప్తి ఆన్‌లైన్‌లో తనకు వరుడు కావాలని ఫోటో పెట్టేది. తనకు వచ్చిన వాటిలో ధనవంతులైన యువకులను ఎన్నుకొని వారిని పెళ్లి చేసుకునేది. అయితే వారి నుండి డబ్బులు పిండుకున్న తర్వాత వారిని వదిలేసి వెళ్లి పోయేది. మళ్లీ ఆన్‌లైన్లో వరుడు కావాలని ఫోటో పెట్టేది. ఇలా దీప్తి ఐదు పెళ్లిల్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీప్తీ తనకు 15 ఏళ్లు ఉన్నప్పటి నుండే మోసాలకు పాల్పడటం ప్రారంభించింది.
ఇలా ఆమె ధనవంతులైన యువకులను పెళ్లి చేసుకొని లక్షల కొద్ది రూపాయలు సంపాదించినట్టుగా తెలుస్తోంది. దీప్తిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఆమె పెళ్లి పేరుతో ఐదుగురినే మోసం చేసిందా మరికొంత మందిని మోసం చేసిందా అనేది విచారణ తర్వాత తెలియనుంది. కాగా దీప్తీకి ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకనే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఆమెను సాయంత్రం కోర్టులో హాజరుపర్చనున్నారు.