నెల్లూరు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ సరికొత్త ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి శుక్రవారం విమర్శించారు. కెసిఆర్ చేసే హెచ్చరికలకు కాంగ్రెసు పార్టీ భయపడదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకునే నిర్ణయం అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందన్నారు.
శుక్రవారం హైదరాబాదుకు వస్తున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ ముందు సీమాంధ్ర నేతలం సమైక్యాంధ్ర గళం విప్పుతామని మంత్రి టిజి వెంకటేష్ కర్నూలు జిల్లాలో అన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర నేతలం త్వరలో న్యూఢిల్లీ వెళతామని ఆయన చెప్పారు.