హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం రాజీనామాలు చేయాలనే తెలంగాణ ప్రజాప్రతినిధుల నిర్ణయంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సానుకూల వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై మాట్లాడకూడదని ఆయన సీమాంధ్ర పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. రాజీనామాలు చేయాలనే తెలంగాణ ప్రజాప్రతినిధుల నిర్ణయం తొందరపాటు అని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులతో సమావేశం తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయ పరిణామాలు, ఒత్తిళ్లు వారు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యకు రాజీనామాలు పరిష్కారం కాదని, తొందరపడవద్దని తాను వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎవరిని కలవాలో వారిని కలవాలని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచన చేయాలని కూడా తాను సూచించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 8 కోట్ల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని ఆయన పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు చెప్పారు. అందరికీ మంచి జరిగే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.