ఎంత మంది తెలంగాణ నేతలు రాజీనామా చేస్తారు?

కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఈ పదవి కోసం పోటీ పడి భంగపడిన మంత్రి జె. గీతారెడ్డి మాత్రం రాజీనామాపై దూకుడుగానే ఉన్నారు. తెలంగాణపై తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తానని చెప్పినా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అందువల్ల ఆయన నుంచి రాజీనామా రాదని స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉన్న హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది రాజీనామాలకు ముందుకు రాకపోవచ్చు.
హైదరాబాదు నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా రాజీనామాలకు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. అలాగే, రంగారెడ్డి జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాంత నేతల సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆమె రాజీనామా చేస్తారా, లేదా అనేది చెప్పలేని స్థితి. లోకసభ సభ్యుడు సర్వే సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడకపోవచ్చు.
శుక్రవారం ఏర్పాటైన కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో సగం మంది హాజరయ్యారు. ఈ సగం మంది కచ్చితంగా రాజీనామా చేస్తారని వివేక్, పొన్నం ప్రభాకర్ వంటి పార్లమెంటు సభ్యులు కచ్చితంగానే చెబుతున్నారు. అమెరికా నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ స్వదేశానికి బయలుదేరారు. అయితే, గుండగుత్తగా అందరూ రాజీనామా చేయకపోయినా, సగం మంది రాజీనామా చేసినా కాంగ్రెసు ఉక్కిరిబిక్కిరై, ఇరకాటంలో పడుతుందనేది మాత్రం నిజం. ఈ క్లైమాక్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.