హైదరాబాద్: అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించవలసినదే అంటూ రాజీనామా హెచ్చరికలు చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులను బుజ్జగించే ప్రయత్నాల్లో ఇటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పడ్డారు. పాలనను పక్కన పెట్టి ముఖ్యమంత్రి, పార్టీని పక్కన పెట్టి బొత్స టి-కాంగ్రెసు వారిని ఎలా మచ్చిక చేసుకోవాలా అనే ప్రయత్నాల్లో పడ్డారు. పట్టు నిలుపుకోవడానికి ముఖ్యమంత్రి బుజ్జగింపులు చేస్తుండగా, సిఎం విఫలం అయితే తాను నిలబెట్టాననే భావన కలిగించడానికి బొత్స ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పలువురు తెలంగాణ మంత్రులతో భేటీ అయ్యారు. ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు.
సీమాంధ్ర మంత్రులు అయిన ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరారరెడ్డిలతోనూ సిఎం భేటీ అయ్యారు. ఏం చేయాలనే విషయంపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాతోనూ సంక్లిష్ట పరిస్థితిపై చర్చించారు. ఈ భేటీకి డిజిపి దినేష్ రెడ్డి హాజరయ్యారు. దీంతో టి-కాంగ్రెసు నేతలు బుజ్జగించాలని వారు తమ పట్టు వీడకుండా సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలనే విషయంపై డిజిపితో ముఖ్యమంత్రి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు రెండో రోజు కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలను ఆయన తన ఇంటికి ఆదివారం ఉదయం ఆహ్వానించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే వారు ససేమీరా అనడంతో సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. అయితే సిఎం, పిసిసి చీఫ్ టి-కాంగ్రెసు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారు.