వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ చిచ్చు: ఆజాద్ వర్సెస్ అహ్మద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gulami Navi Azad
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు జాతీయ కాంగ్రెస్ అధిష్ఠానం వర్గాల్లో విభజన తీసుకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ సమస్యపై ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంలో ఒక స్పష్టత లేదు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకుల్లోనే తీవ్ర అభిప్రాయభేదాలు పొడసూపుతున్నట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానంలోనే తెలంగాణ అనుకూల, ప్రతికూల వాదనలు వినపడుతున్నాయి. ఈ అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇద్దరూ తీవ్రంగా విడిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్యపై ఇప్పటికిప్పుడే తేల్చలేమని, ఇతర రాష్ట్రాలతో ఇది ముడిపడి ఉన్నదని, మూడు ప్రాంతాల్లో ఏకాభిప్రాయం అవసరమని ఆజాద్ చేసిన ప్రకటనపై అహ్మద్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆజాద్ ప్రకటనలపై అహ్మద్ పటేల్‌కు తెలంగాణ నేతల నుంచి పలు ఫిర్యాదులు అందాయి.

దీంతో ఆయన రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్ బొత్స, ఎంపీలు కేకే, జానా, పొన్నంలతో మాట్లాడారు. అదే సమయంలో, అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమి చేయబోతున్నారో ఊహించి, దాన్ని నివారించడంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆజాద్ విఫలమయ్యారని, పైపెచ్చు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఒక సీనియర్ నేత శనివారం ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి పి.సుధాకర్ రెడ్డి కూడా అహ్మద్ పటేల్‌ను కలిసి.. జరిగిన పరిణామాలపై నోట్ సమర్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలపై ఎవరూ వెనక్కు తగ్గే అవకాశం లేదని, కనుక తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేయడమే సరైనదని ఆయన చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపైనే కాకుండా పార్టీలో చాలా కాలంగా అహ్మద్‌పటేల్, గులాంనబీ ఆజాద్‌ల మధ్య అనేక అంశాలపై విభేదాలున్నాయని, ఇప్పుడు ఇవి మరింతగా వెల్లడవుతున్నాయని తెలుస్తోంది.

ఫైళ్లన్నీ అహ్మద్‌పటేల్ ద్వారానే మేడమ్ వద్దకు వెళుతున్నప్పటికీ.. సోనియా మాత్రం సాధారణంగా పార్టీలోని ప్రధాన కార్యదర్ళుల సలహాలకు ప్రాధాన్యత నిస్తారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరప్ప మొయిలీ రాష్ట్ర వ్యవహారాల్లో తప్పుడు నివేదికలు పంపుతున్నారని, జగన్ వ్యవహారం ముదరడానికి ఆయనే కారణమని పలు నివేదికలు అందినప్పటికీ.. సోనియా మాత్రం మొయిలీని సాగనంపడానికి చాలాకాలమే తీసుకున్నారు. తెలంగాణను ఇప్పటికిప్పుడే పరిష్కరించలేమన్న ఆజాద్ వైఖరితో పార్టీలో దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు సమర్థిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు యత్నించాలని, కె.వి.పి.రామచంద్రరావును సానుకూలంగా మార్చుకుంటే.. ప్రభుత్వాన్ని స్థిరంగా నడపవచ్చునని వారు అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలిసింది.

అయితే తెలంగాణ అంశాన్ని ఎక్కువ కాలం నాన్చలేమని దాన్ని పరిష్కరించాలని అహ్మద్‌పటేల్, జనార్దన్ ద్వివేది, ఆంటోనీ లాంటి వంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా

ఇరు వర్గాల అభిప్రాయాల మధ్య నలిగిపోక తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆజాద్, అహ్మద్ పటేల్‌లు.. ఒకరిపై మరొకరు రాజకీయ బాణాలు విసురుకుంటున్నారని, అందులో భాగంగానే తెలంగాణ సమస్య మళ్లీ రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలంగాణ అంశాన్ని ఆజాద్ తేలికగా తీసుకున్నారని, రాజీనామాలు చేసేంత ధైర్యం తెలంగాణ నేతలకు లేదని జరిగిన ప్రచారాన్ని ఆయన నమ్మారని ఒక వేళ రాజీనామాలు చేసినా అధిష్ఠానం కన్నెర్ర చేస్తే పిల్లుల్లా వెనక్కు తగ్గుతారని ఆయన భావించారని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, ఇతర పదవుల భర్తీతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆజాద్ భావించారన్నది ఈ వర్గం వాదన.

కానీ ఆజాద్ అంచనాలు ఇప్పుడు తారుమారయ్యే అవకాశాలున్నాయని ఈ వర్గం చెబుతోంది. గతంలో లాగా రాజకీయ సమస్యలు పరిష్కరించగల సామర్థ్యం ఆజాద్‌కు తగ్గిందని ఈ వర్గం అంటోంది. తమిళనాడులో తంగబాలును పీసీసీ అధ్యక్షుడుగా నియమించి ఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినేందుకు కారణమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆజాద్ పరిస్థితి కూడా ఇలానే తయారు కావొచ్చన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది.

English summary
It seems, telangana issue is took differences in congress high command. The cold war going between Ahmed Patel and Gulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X