రగులుతున్న సీమాంధ్ర, నేతలకు ఐకాస హెచ్చరిక

బుధవారం సీమాంధ్రలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం భేటీ అయిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నిర్ణయించింది. 7న మానవ హారాలు, 8న నిరసనలు, 9న సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం కలసి ఉండాలన్నదే సీమాంధ్రుల ప్రగాఢ ఆకాంక్ష అని కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సీమాంధ్ర అగ్నిగుండంగా మారుతుందని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ డీవీ కృష్ణయాదవ్ హెచ్చరించారు. నెల్లూరులో సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, 14 (ఎఫ్)ను తొలగించవద్దని కోరుతూ గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస, విద్యార్థి ఐకాసల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు.విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు జరిగాయి.












Click it and Unblock the Notifications