హైదరాబాద్/నల్గొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సీమాంధ్రులు వాస్తవాలు తెలుసుకున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం శుక్రవారం అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనకు మనస్పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. శనివారం తాము సమావేశమవుతున్నామని భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. రాజీనామాల వల్ల తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం కనిపించిందన్నారు. రాజీనామాలతు ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుందన్నారు. తెలంగాణ కోసం చేస్తున్న ఉద్యమాలలో భాగంగా ర్యాలీలు, బందులు సంపూర్ణంగా జరిగాయని చెప్పారు.
కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తాను మాజీ మంత్రిగానే కొనసాగుతానని చెప్పారు. అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. లేదా తమ రాజీనామాలు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు.