విజయవాడ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్ర అంటూ అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవద్దని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులకు సూచించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. అలాంటి అంశంపై రాష్ట్రంలో సమైక్యవాదం అంటూ రెచ్చగొట్టే చర్యలకు టిడిపి పూనుకుంటుందని అవి మానుకోవాలని సూచించారు. అనవసరంగా విద్వేశాలు రెచ్చగొట్టవద్దని అన్నారు.
కృష్ణా జిల్లాలోని సమస్యలపై జిల్లాకు చెందిన విపక్షాలతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు. జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు శిఖండిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక క్వారీల్లో డబ్బులు బాగా దండుకున్నారని ఆరోపించారు.