పట్టుకు వ్యూహం: తెలంగాణలో టిడిపి వర్సెస్ జెఏసి

వారిలో అభద్రతా భావం తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది. కెసిఆర్, జెఏసి ప్రస్తుత పరిస్థితులలో రాజీనామాకు సిద్ధం కారనే భావనలో ఉండి ఉంటారు. కానీ కాంగ్రెసు, బిజెపి, టిఆర్ఎస్ కంటే టిడిపి వారే ముందుగా రాజీనామా చేసి మరో వంద మంది రాజీనామా చేయడానికి కారణయ్యారు. మొదట టిడిపి వారు కాకుండా కాంగ్రెసు వారు చేసి ఉంటే ఈ స్థాయిలో రాజీనామాలు ఉండి ఉండక పోవచ్చుననే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాజీనామాకు నేతలు ముందుకు రావడానికి టిడిపి మొదట రాజీనామాలే చేయడమనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి రాజీనామాలతో తెలంగాణ ప్రజల్లో కాస్తో కూస్తో వారి పట్ల ఉన్న వ్యతిరేకత పోయింది. పూర్తిగా మాత్రం పోలేదు. అయితే ఆ కాస్తను సైతం క్యాష్ చేసుకునే పనిలో భాగంగా టిడిపి బస్సు యాత్ర చేపట్టింది. దీనిని పసిగట్టిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, టిఆర్ఎస్‌లు రాజీనామాలను టిడిపి క్యాష్ చేసుకోకుండా చూసేందుకు టిఆర్ఎస్, జెఏసి టిడిపికి ఐక్య వేదికలోకి ఆహ్వానం అనే వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది.
ఇన్నాళ్లూ టిడిపిని పక్కన పెట్టి, దానినే టార్గెట్ చేసుకున్న టిఆర్ఎస్, ఐక్య కార్యాచరణ సమితి టిడిపిని ఐకాసలోకి ఆహ్వానించి దాని ప్రాధాన్యతను తగ్గించే లక్ష్యంతోనే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే టిడిపి చేపట్టిన బస్సు యాత్రను వాయిదా వేసుకోవాలని కోదండరాం కోరినట్లుగా సమాచారం. టిడిపి బస్సు యాత్రకే మొగ్గు చూపడం వారికి కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఇన్నాళ్లు హైదరాబాదులో ఉండి రాజకీయాలు నెరపిన కెసిఆర్, ఐకాస రాజీనామాల తర్వాత చలో ఢిల్లీ అంటున్నారు. అయితే టిడిపి మాత్రం తెలంగాణ కోసం ఢిల్లీనే ఇక్కడకు రప్పించాలి. మనం వెళ్లవలసిన అవసరం లేదంటూ జెఏసికి తిరిగి షాక్ ఇచ్చింది. అంతేకాదు టిడిపి చేపట్టిన బస్సు యాత్రకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్, విమలక్క తదితరులు మద్దతు పలికారు. రాజీనామాలు చేసిన టిడిపి వారిని విమర్శించలేని ప్రస్తుత పరిస్థితులో ఉన్న జెఏసి సైతం బస్సు యాత్రను అడ్డుకోలేమని చెప్పింది. దీంతో టిడిపి ఉత్సాహానికి అడ్డులేకుండా పోయింది.
అయితే జెఏసి ఆహ్వానం మేరకు టిడిపి వారితో కలిసి వెళుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే జెఏసితో కలిసి వెళితే కెసిఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. మళ్లీ కెసిఅర్‌కే ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ విషయమే టిటిడిపి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. జెఏసితో వెళ్లినప్పటికీ తమ ప్రాధాన్యత ఉంటేనే వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. లేని పక్షంలో మరో జెఏసిని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. కెసిఆర్ తీరును ఇప్పటికే కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి స్వతంత్ర సమర యోధులు, గద్దర్, విమలక్కి ప్రజా నేతలు తప్పు పడుతున్న నేపథ్యంలో టిడిపి ఏర్పాటు చేసే జెఏసికి వారి మద్దతు ఉండవచ్చు. అయితే వారి ప్రాధాన్యత నిలుపుకుంటూనే జెఏసితో కలుస్తారా లేదా మరో జెఏసి పెడాతారా చూడాలి. ఇప్పటికే టిఆర్ఎస్ ఒంటెత్తు పోకడలపై బిజెపి, సిపిఎ(ఐఎల్) తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే బిజెపి వంటి పార్టీలు టిడిపితో కలిసే అవకాశం లేదు.