'తెలంగాణపై లగడపాటి లాగే వైయస్ జగన్..'

సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ కూడా తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నారని, లగడపాటి మాటకు జగన్ వైఖరికి తేడా ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా చెప్పారని, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాగానే సమైక్యవాదాన్ని బలపరిచారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రజలు భిన్నమైన విధానాన్ని ఆశిస్తారని, ఆ స్పష్టతను జగన్ ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు.
తెలంగాణపై వైయస్ జగన్ వైఖరిలో స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణలో జగన్‌ను తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై జగన్ విధిలేక చేసిన ప్రకటనలాగా కనిపిస్తోందని తెరాస నాయకుడు మధుసూదనాచారి అన్నారు. జగన్‌ది పచ్చి అవకాశవాదమని ఆయన అన్నారు. జగన్ బాబు కూడా ఆంధ్రా బాబేనని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. వైయస్ జగన్ తెలంగాణ వైఖరిని మంత్రి సారయ్య కూడా తప్పు పట్టారు.
కొండా సురేఖకు కాంగ్రెసు ద్వారాలు తెరిచే ఉన్నాయని, కాంగ్రెసులోకి వస్తే తెలంగాణ కోసం కలిసి పనిచేయవచ్చునని సారయ్య అన్నారు. తెలంగాణలో పర్యటించేందుకే జగన్ తెలంగాణ సెంటిమెంటును ప్రస్తావించారని వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో వైయస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైయస్ జగన్‌ను తెలంగాణలో అడ్డుకుంటామని కాకతీయ విశ్వవిద్యాలయం జెఎసి ప్రకటించింది. అయితే, వైయస్ జగన్ వైఖరిని కొండా సురేఖ ఆహ్వానించారు. సెంటిమెంటును గౌరవిస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఇవ్వాలని చెప్పినట్లే కదా అని ఆమె అంటున్నారు.