సోనియా గాంధీ, చంద్రబాబు తెలంగాణ డ్రామా

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదనే మాటను కేంద్ర ప్రభుత్వం మాటగా చిదంబరం చెబుతున్నారని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేస్తే సమస్య పరిష్కారమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కాంగ్రెసును వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ, చంద్రబాబుకు ఎంత బాధ్యత ఉందో సోనియాకు కూడా అంతే బాధ్యత ఉందనే విషయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. నిజానికి, చంద్రబాబు తాము తెలంగాణపై వైఖరిని స్పష్టం చేశామని చెబుతున్నారు. కానీ, అడ్డుపడింది మాత్రం ఆయనే అనే విషయం అందరికీ తెలుసు. ఒక వేళ చంద్రబాబు పార్టీపరంగా తీసుకున్న తెలంగాణ సానుకూల వైఖరికి కట్టుబడి ఉంటే 2009 డిసెంబర్ 9వ తేదీ తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చిదంబరం ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెసు తీవ్రమైన ఇబ్బందుల్లో పడి ఉండేది.
చంద్రబాబును చూపించి తమ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయాన్ని మరుగు పరిచేందుకు కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు, రెండు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం కావాలని, శాసనసభలో తీర్మానం ఆమోదం పొందాలని కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజీనామాల ద్వారా, దీక్షల ద్వారా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తమ అధిష్టానం మీదనే పోరాటం చేస్తుంటే, తెలుగుదేశం తెలంగాణ నాయకులు కాంగ్రెసు పేరు చెప్పి తెలంగాణలో తిరిగి తమ ప్రాబల్యాన్ని పాదుకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ వైఖరులను స్పష్టం చేస్తే సమస్యకు ఒక స్పష్టత వస్తుంది.
చంద్రబాబు వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. శాసనసభ తీర్మానం కూడా ఆవసరం లేదు. అభిప్రాయం కోరితే సరిపోతుంది. ఆ అభిప్రాయం ఎలా ఉన్నా సరే. రాష్ట్రంలో తమ పార్టీ ఇరు ప్రాంతాల నాయకుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించలేక నెపాన్ని ఇతరులపైకి నెడుతోంది. తెలంగాణకు వ్యతిరేకంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, ఉద్యమ పార్టీలు, సంఘాలు నిర్ణయం తీసుకుంటాయి.