విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని విచారించాలని లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. వైయస్సాఆర్ మరణాన్ని రాజకీయ వేదికగా చేసుకొని అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందింది జగనే అని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణ ఎవరి కుట్ర కాదని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఆస్తులపై విచారణ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వైయస్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలంటే ముందుగా జగన్‌పై విచారణ చేయాలన్నారు.
వైయస్ మృతిని నిచ్చెనలా చేసుకొని జగన్ రాజకీయం నెరపుతున్నారని అలాంటి జగన్‌పై చాలామందికి అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ మృతి చెందిన సమయంలో రాష్ట్రం మొత్తం విషాదంలో ఉంటే జగన్ రాజకీయ విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. నాడు వాతావరణం బాగా లేదని విజయమ్మ చెప్పినా వైయస్ ప్రయాణం చేసి ప్రమాదం కొనితెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఆరవ సిఫార్సును అమలు చేయాలని ఆయన కోరారు. మంత్రి తోట నరసింహంపై దాడి అమానుషం అన్నారు.