బొత్స బుజ్జగింపులు: ఢిల్లీకి టి - కాంగ్రెసు నేతలు?
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ చైనాలో చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు తాము ఆయనతో చర్చలు జరిపేది లేదని, తెలంగాణపై పార్టీ అధిష్టానం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు ఢిల్లీ వెళ్లేది లేదని సోమవారం తేల్చి చెప్పిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ ఢిల్లీ పర్యటనపై వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ టి-కాంగ్రెసు ప్రజా ప్రతినిధులతో సమావేశమై వారిని ఢిల్లీ వెళ్లవలసిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పట్టుబడుతున్న మీరు అధిష్టానం నుండి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి మీ అభిప్రాయం ఖచ్చితంగా చెబితే ప్రయోజనం ఉంటుందని ఆయన టి-నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
అధిష్టానం పిలిచాక వెళ్లకపోతే ఇబ్బందులు ఉంటాయని సూచించినట్లుగా తెలుస్తోంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దని సూచించారని సమాచారం. బొత్స వ్యాఖ్యల ప్రభావం కొందరు నేతలపై పడ్డట్లుగా తెలుస్తోంది. అధిష్టానం పిలిచినప్పుడు వెళ్లడమే మంచిదవుతుందని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఉండి ఏం చేయక పోవటం కంటే ఢిల్లీ వెళ్లి అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టడం ఉచితమని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది సభ్యులు మాత్రం బొత్సతో విభేదించినప్పటికీ మంగళవారం తెలంగాణ నేతలు మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.