హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్‌పై సిబిఐ అధికారులు మూడోరోజు సైతం విచారణ చేపడుతున్నారు. జగతి పబ్లికేషన్స్‌పై మంగళవారం రాత్రి పన్నెండు గంటల వరకు విచారణ జరిగింది. అయినప్పటికీ విచారణ పూర్తి కాక పోవడంతో జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు బుధవారం కూడా సిబిఐ ముందు హాజరయ్యారు. జగతి అనంతరం ఇందిరా టెలివిజన్, భారతి ప్రతినిధులు హజరయి కంపెనీలకు సంబంధించిన వివిద పత్రాలను సిబిఐ అధికారులకు సమర్పించారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ప్రభుత్వం నుండి లాభం పొందారా లేక లాభం పొందాక పెట్టుబడులు పెట్టారా, పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారు తదితర పూర్తి ఆధారాలు అధికారులు తీసుకుంటున్నారు.
కాగా సిబిఐ 19 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. జగతి, ఇందిరా, భారతి, లార్క్ కో తదితర 10 కంపెనీలు ఇప్పటి వరకు సిబిఐ విచారణకు హాజరయ్యాయి. మ్యాట్రిక్, పొట్లూరి ప్రసాద్ తదితర తొమ్మిది కంపెనీలు సైతం సిబిఐ విచారణకు నేడో రేపో హాజరయ్యే అవకాశం ఉంది. సండూరు, ఏషియన్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను విచారిస్తామని చెప్పారు.