గుంటూరు: సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ఆత్మహత్యలు కాదని ఆత్మహుతి దాడులకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదని గుంటూరులో జరిగిన సమైక్యాంధ్ర టిడిపి సమావేశంలో కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని డిమాండ్ చేశారు. తమ దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు కానిచ్చే ప్రసక్తి లేదని పయ్యావుల అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు మావి కడుపు మండిన ఉద్యమాలు అయితే సీమాంధ్రులవి కడుపు నిండిన ఉద్యమాలు అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ నుండి బయటకు రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి సూచించింది. ఆత్మాహుతి దాడులు చేస్తామని చెప్పిన పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పయ్యావుల వ్యాఖ్యలపై బాబు, ఎర్రబెల్లి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.