హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావుపై కేసులు పెట్టి సీమాంధ్ర సేనను ఏర్పాటు చేస్తామన్న మంత్రి టిజి వెంకటేష్, ఆత్మాహుతి దాడులు చేస్తామన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌పై కేసులు ఎందుకు పెట్టలేదని టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారాక రామారావు శుక్రవారం టిఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. తెలంగాణ వారికి ఓ న్యాయం, సీమాంధ్రులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు అన్నారు. తెలంగాణ కోసం మృతి చెందిన యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తరలించకుండా నేరుగా స్మశానానికి తరలించారని చందర్ రావు లేఖ రాయడంపై తాము జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తామని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని చెప్పారు. ఎపి భవన్‌లో తెలంగాణ వాళ్లు ఉంటే యాదిరెడ్డి మృతదేహానికి అవమానం జరిగేది కాదన్నారు. తెలంగాణ వారు మూడో కన్ను తెరిస్తే సీమాంధ్రులు హైదరాబాదులో తిరగలేరని మరో నేత అన్నారు. యాదిరెడ్డి త్యాగాన్ని కించపరిచే విధంగా అధికారులు ప్రవర్తించారని అన్నారు.