వైయస్ జగన్‌కు అక్కడ, వారికి ఇక్కడ!

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అథ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులపై సిబిఐ దర్యాఫ్తులో చాలా విషయాలు బహిర్గతమవుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీగా జగన్ లాభపడ్డట్టుగా సిబిఐ దర్యాఫ్తులో తేలుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్ జగన్ అక్రమార్జన ఆరోపణలపై విచారణ జరుపుతున్న సిబిఐ ఇప్పటికే అందిన డాక్యుమెంట్లను పరిశీలించి, విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్ తదితర కంపెనీల నుంచి సీబీఐ కోరిన వివరాల్లో అత్యధిక శాతం రికార్డులు సీబీఐకి అందాయి. వాటిని విశ్లేషించిన సిబిఐ పెట్టుబడుల రూపంలోనే కాకుండా రుణాల రూపంలోనూ జగన్ కంపెనీల్లోకి అక్రమంగా ధనం వచ్చి పడినట్లు సిబిఐ గుర్తించింది.

తాజాగా, సిబిఐ పరిశీలించిన రికార్డుల ప్రకారం నవభారత్ అనే కంపెనీకి శంషాబాద్ వద్ద 250 ఎకరాల సెజ్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటాయించారు. ఇదే నవభారత్ కంపెనీ ఆర్ఆర్ గ్లోబల్ అనే కంపెనీకి రూ.20 కోట్లు అప్పు ఇచ్చింది. ఈ ఆర్ఆర్ గ్లోబల్ మరెవరిదో కాదు సాక్షి పత్రిక బాధ్యతలు చూస్తున్న రామకృష్ణారెడ్డిది. ఆర్ఆర్ గ్లోబల్ కార్యాలయం చిరునామా బంజారాహిల్స్‌లోని కృష్ణసింధు రెసిడెన్సీలోని ఒక ఫ్లాట్‌లో ఉంది. ఈ ఫ్లాట్‌లో నివసిస్తున్నది మరెవరో కాదు సాక్షి గ్రూపు ఆడిటర్, వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి. ఇక, శంషాబాద్‌లో నవభారత్‌కు కేటాయించిన సెజ్‌లోకి హఠాత్తుగా మంత్రి డెవలపర్స్ అనే సంస్థ ప్రవేశించింది. ముంబై ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థకు బెంగళూరులో కామర్స్ మంత్రి భవనం ఉంది. తర్వాతి కాలంలో ఆ భవనం జగన్ కనుసన్నల్లోని క్లాసిక్ రియాల్టీ పరమైంది. అంటే బెంగళూరులోని కామర్స్ మంత్రి భవనం జగన్ పరమైతే అందుకు ప్రతిఫలంగా నవభారత్‌కు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సెజ్‌లో మంత్రి డెవలపర్స్‌కు భాగస్వామ్యం దక్కింది.

తద్వారా, కోట్లాది రూపాయల ఆస్తి జగన్‌కు ప్రైవేటు ఆస్తిగా జమయితే అందుకు ప్రతిగా చెల్లింపులు మాత్రం ఇక్కడ ప్రభుత్వం నుంచి జరిగిపోయాయి. వాస్తవానికి, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ సంస్థలు కొలువుదీరిన బన్నేరుఘట్ట ప్రాంతంలో కామర్స్ మంత్రి భవనం ఉంది. దీని విలువ సుమారు రూ.300-400 కోట్లని అంచనా. సుశీల్ మంత్రి గ్రూపునకు చెందిన క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2004లో దీనిని నిర్మించింది. ఒరాకిల్, షాపర్స్ స్టాప్ వంటి కార్పొరేట్ దిగ్గజాల కార్యాలయాలన్నీ ఈ భవనంలోనే ఉన్నాయి. వీటి ద్వారా ఏటా వచ్చే అద్దె రూ.27 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ అత్యాధునిక భవంతిపై జగన్ కన్ను పడింది. తామరతంపర కంపెనీలు గజిబిజి లావాదేవీలు. అనుబంధ కంపెనీల ద్వారా పెట్టుబడుల ప్రవాహంలో తలపండిన జగన్ మంత్రి భవన్ వ్యవహారంలోనూ ఇదే తరహా వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. తొలుత, సండూర్ పవర్ కంపెనీ ద్వారా జగన్, ఆయన మనుషులు క్లాసిక్ రియాల్టీ కంపెనీలోకి ప్రవేశించారు.

షేర్లను బదిలీ చేయించుకుని మొత్తం భవంతిపై హక్కు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. మారిషస్ నుంచి తిరిగొచ్చిన నిధులతో క్లాసిక్ రియాల్టీ షేర్లను సండూర్ పవర్‌కు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీదకు బదిలీ చేయించుకున్నారు. దీంతో, ఆ కంపెనీ జగన్ సొంతమైంది. ఆ తర్వాత, ఆ కంపెనీకి వైఎస్ భారతీరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఇక, జగన్‌కు మంత్రి భవన్ దక్కినందుకు ప్రతిఫలాన్ని ఇక్కడ వైఎస్ ప్రభుత్వం చెల్లించింది. హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి వద్ద బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఐటీ సెజ్ పేరిట 2006లో వైఎస్ ప్రభుత్వం 250 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో మార్కెట్ ధర ఎకరా కోటి రూపాయలు ఉంటే కేవలం రూ.20 లక్షలకే కేటాయించేశారు. బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్ అనేది హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నవభారత్ వెంచర్స్‌కు అనుబంధ సంస్థ. ఆ తర్వాత, అసలు వ్యవహారం నడిచింది. బ్రాహ్మణికి ఒక టెక్నికల్ అసోసియేట్ కమ్ డెవలపర్‌గా 2008లో మంత్రి డెవలపర్స్‌ను తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత, రెండేళ్లకు మంత్రి గ్రూపునకు చెందిన వారు బ్రాహ్మణిలో వాటాదారులుగా చేరినట్లుగా తెలుస్తోంది.

వారికి లక్షల షేర్లను ముఖ విలువపై కేటాయించారు. తద్వారా, బ్రాహ్మణిని కూడా మంత్రి డెవలపర్స్ పరం చేసేందుకు దానికి ఉన్న 25 శాతం వాటాను కూడా ఆ సంస్థకే దక్కేలా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సిబిఐ విచారణలో ఈ వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, కోల్‌కతాకు చెందిన అనామక కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్, ఇతర సంస్థలకు రూ.60 కోట్ల వరకు నల్లధనం వచ్చిందనే కోణంలో జరిగిన విచారణలోనూ సిబిఐ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమార్జనపై విచారణ చేపట్టిన సీబీఐ ఈనెల 26వ తేదీలోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కథనాన్ని ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+