కర్నూలు: ప్రత్యేక తెలంగాణ అంశం విషయంలో మంత్రి టిజి వెంకటేష్ ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకు వచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలలో మూడు రాజధానులను ఉమ్మడిగా ఏర్పాటు చేయాలని ఆయన ప్రత్యేక ఫార్ములాను తెరపైకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత కూడా అభివృద్ధిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే విడిపోవచ్చునని టిజి సూచించారు. అయితే మూడు ప్రాంతాలు ఉమ్మడి రాజధానులుగా ఏర్పడి అభివృద్ధి చెందాకే రాష్ట్రం విభజనపై ఆలోచించాలన్నారు. న్యూఢిల్లీలో సీమాంధ్రుల డిమాండ్లు వినిపిస్తామని చెప్పారు. ఒకవేళ విభజన జరిగితే మూడు రాష్ట్రాలుగా ఉండాలి. లేదంటే సమైక్య రాష్ట్రంగా ఉండాలని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విడగొడతామని కేంద్రం అంటే తాము ఏమి చేయలేమని అన్నారు. రాయలసీమ హక్కుల వేదికగా తాము ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం లేదన్నారు. తాము తమ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించే నేపథ్యంలో వెనుకబడిన రాయలసీమకూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆంధ్రా ప్రాంతం నేతలు మద్దతు ప్రకటించాలని లేదంటే మా దారి మేం చూసుకుంటామని చెప్పారు.