విజయవాడ: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని అందుకే ఆయన ఆ విషయంపై అంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. లగడపాటికి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తన వైఖరి ప్రకటించిన తర్వాత చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. లగడపాటి తమ పార్టీ చేత అభిప్రాయం చెప్పించకుండా చంద్రబాబును ప్రశ్నించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ల్యాంకో హిల్స్ అనుమతి కోసం చంద్రబాబు చుట్టూ తిరిగి, పడిగాపులు కాసిన విషయం లగడపాటి మరిచినట్టున్నారన్నారు. ఆయన ఎంపీ అయినప్పటి నుండి జెండాలు పట్టుకొని వీధుల్లో తిరగడం తప్ప విజయవాడకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏడేళ్లుగా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఒకవేళ ఆయన అభివృద్ధి చేశానని చెబితే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. విజయవాడను వెనీస్ నగరంలా మారుస్తానని హామీ ఇచ్చారని కానీ పారిశుద్ద్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.