హైదరాబాద్: కర్ణాటక మంత్రులు గాలి బ్రదర్స్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. కర్ణాటక రాజకీయాలను మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి సోదరులు భ్రష్టు పట్టించారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. గాలి బ్రదర్స్ 40 శాతం మైనింగ్‌ను మామూళ్ల కింద వసూలు చేశారని ఆయన ఆరోపించారు. గాలి బ్రదర్స్ వ్యవహారాన్ని కర్ణాటక లోకాయుక్త స్ఫష్టంగా ఎత్తి చూపిందని ఆయన అన్నారు. మైనింగ్ మాఫియా దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాలి బ్రదర్స్ అధికార దుర్వినియోగానికి పాల్పపడ్డారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారి మైనింగ్ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెసుపై కూడా ఆయన తీవ్ర ధ్వజమెత్తారు. కాంగ్రెసు అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. మన్మోహన్ సింగ్‌ను ఆయన చేతకాని ప్రధానిగా ఆయన అభివర్ణించారు. అవినీతిపరులు దేశాన్ని కొల్గగొడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అవినీతిపరులను కాంగ్రెసు వెనకేసుకొస్తోందని ఆయన అన్నారు. సివిసిగా థామస్ నియామకమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై కోర్టు ఎన్నో సార్లు మొట్టికాయలు వేసిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెసు బేఖాతరు చేస్తోందని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. డబ్బులతో రాజకీయం చేయడం మంచిది కాదని, తమిళనాడు ఎన్నికల్లో అవినీతి సొమ్ము పంచి అడ్రస్ లేకుండా పోయారని ఆయన అన్నారు. ప్రధానిని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.