'జగన్, చిరంజీవి నాయకులు టిడిపి గూటికి'

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎప్పుడూ కనీవిని ఎరుగనిది అని అన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ వెంట ఎవరూ ఉండరని, అదే సమయంలో అసమర్థ కాంగ్రెస్ వైపూ వెళ్లరని అభిప్రాయపడింది. వైఎస్సార్ కాంగ్రెస్, ప్రరాపా నాయకులు తిరిగి తెదేపా వైపే చూస్తారని ధీమా వ్యక్తం చేసింది. 14ఎఫ్ నిబంధనను రద్దుచేస్తూ శాసనసభ గతంలో తీర్మానం చేసిందని, మళ్లీ తీర్మానం చేయాలనడం అసెంబ్లీని అవమానపరచడమేనని ఉద్ఘాటించింది. నాటి తీర్మానాన్ని యుద్ధప్రాతిపదికన అమలుచేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లడంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసుకునే కృషిని మరింతగా చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ఎగువ రాష్ట్రాలైన ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రలు వంశధార, మహేంద్రతనయ, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులపై అక్రమ నిర్మాణాలు చేస్తున్నా కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలను స్వయంగా సమీక్షించేవారు. ఒరిస్సాతో పలుమార్లు సంప్రదింపులు చేశారు. ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని 14జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదముంది అని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నీటిపారుదల నిపుణులతో చర్చించి, అవసరమైతే అఖిలపక్షం నిర్వహించి, వీటిపై ఏం చేయాలి.. న్యాయస్థానాల్లో ఎలా అప్పీలు చేయాలో నిర్ణయించాలన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లలను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటింపచేస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆ పనిచేయలేదని దుయ్యబట్టారు. ఐదులక్షల మంది విద్యార్థులు ఫీజు తిరిగి చెల్లింపు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాస్తవాలు చెప్తే ఉరేసుకోవాలంటూ ఆరోగ్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారని, ఒక మంత్రి ఇలా మాట్లాడడం చరిత్రలో తొలిసారి చూస్తున్నానన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ లోక్‌సభలో పెట్టే భూ సేకరణ బిల్లుపై అన్ని రైతు సంఘాలతో విస్తృతంగా చర్చించి రైతు సంతోషపడేలా దాన్ని రూపొందించాలని తీర్మానించామన్నారు. వస్త్రాలపై వ్యాట్ విధింపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశామన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఎర్రంనాయుడు పునరుద్ఘాటించారు. శ్రీకృష్ణ కమిటీని ఎవరూ బహిష్కరించలేదని, అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పాయని ఆ నివేదికపై నిర్ణయించాల్సింది కేంద్రమేనన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు.












Click it and Unblock the Notifications