జగన్, బాబులకు ప్రేమ: రైతులకు ఈ స్థితి ఎందుకు?

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రాంతాల్లో పర్యటించారు. రైతులను పరామర్శించారు. నిజానికి, కోస్తాంధ్రలో ఇటువంటి పరిస్థితి రావడం విచిత్రమే. ధాన్యాగారంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనివల్ల తీవ్రంగా దెబ్బ తినే స్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడం వెనక నేపథ్యం పెద్దగానే ఉంది. వరుస తుఫాన్లతో కోస్తాంధ్రలోని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మునుపెన్నడూ లేని విధంగా ఆత్మహత్యలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పరిపాటిగా జరుగుతుండేవి. తెలంగాణలో పంటలు పండాయా, లేదా అనే విషయాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. కానీ, అదే కోస్తా ప్రాంతానికి వచ్చే సరికి ఆలోచన భిన్నంగా ఉంటుంది. ప్రభావం కూడా అలా కనిపిస్తుంది.
కోస్తాంధ్రలోని భూయజమానులు, అంటే అసలు రైతులు హైదరాబాదుకో, విదేశాలకో వలసలు వెళ్లారు. వారి భూములను కౌలుకు తీసుకుని వేరే వారు సాగు చేస్తున్నారు. వీరినే కౌలు రైతులు అంటున్నాం. తుఫానుల వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరికి సహాయం చేయాలని, కౌలు రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్, చంద్రబాబుతో పాటు చిరంజీవి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు, జగన్ ఆందోళనలు చేశారు. కోస్తా ప్రాంతంలో ఎకరానికి కౌలు 8 వేల నుంచి పది వేల రూపాయల వరకు ఉంటుంది. ఇలా కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసిన కౌలు రైతులు వరుస తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వారు తిరిగి భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే స్థితిలో లేరు. వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడమే కాకుండా భయాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కౌలుకు తీసుకోవడానికి రైతులు వెనకాడుతున్న పరిస్థితిలో భూమి యజమానులు క్రాప్ హాలిడేను ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారి కోసం చంద్రబాబు, జగన్ ఉద్యమాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications