ఊపిరాడట్లేదు.. డేంజర్ జోన్‌లోకి 11 కోట్ల మంది జనాభా!
ప్రకృతి ఆగ్రహిస్తే ఎంతటి అగ్రరాజ్యమైనా మోకరిల్లాల్సిందేనని అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఊహించని విధంగా అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాలను దట్టమైన, ప్రమాదకరమైన పొగ మేఘాలు కమ్మేశాయి. పగటిపూట కూడా ఆకాశం నల్లగా, నారింజ రంగులోకి మారిపోయి భయంకర వాతావరణాన్ని తలపిస్తోంది. పొరుగు దేశమైన కెనడా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుల వేడి.. ఇప్పుడు అమెరికా ఊపిరితిత్తులను పిండేస్తోంది. కోట్ల మంది సామాన్య జనాభా గాలి పీల్చుకోవడానికి కూడా భయపడే విపత్కర పరిస్థితి ఇక్కడ ఏర్పడింది.
ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం..
తాజా నివేదికల ప్రకారం, అమెరికా వ్యాప్తంగా దాదాపు 10.9 కోట్ల మంది జనాభా ప్రస్తుతం అత్యంత విషపూరితమైన గాలిని పీల్చుకుంటూ నరకం చూస్తున్నారు. చికాగో, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, పిట్స్‌బర్గ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలన్నీ పొగ కోరల్లో చిక్కుకున్నాయి. వాయు కాలుష్యం ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే.. సాధారణ ఆరోగ్యవంతులు కూడా ఈ గాలి పీల్చితే ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో స్థానిక ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అవుట్‌డోర్ వ్యాయామాలు ఆపేయాలని, ఇళ్లలో వెంటిలేషన్ లేని వారు పబ్లిక్ ఎయిర్ కండిషన్డ్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ముప్పు..
ఉత్తర రాష్ట్రాల్లో మొదలైన ఈ పొగ తుఫాను అక్కడితో ఆగలేదు. బలమైన గాలుల కారణంగా ఈ దట్టమైన పొగ వందల మైళ్ల దూరం ప్రయాణించి దక్షిణాన ఉన్న నార్త్ కరొలినా వరకు విస్తరించింది. అడవుల్లో మంటలు ఎగసిపడినప్పుడు వచ్చే సూక్ష్మ కాలుష్య కణాలు (ఫైన్ పార్టికల్స్) వాతావరణంలో చాలా ఎత్తుకు చేరి, అక్కడి అంతర్జాతీయ పవన వ్యవస్థల ఆధారంగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, గాలుల దిశ నిరంతరం మారుతుండటంతో ఒక ప్రాంతంలో పొగ తగ్గినా, వెంటనే మరో ప్రాంతాన్ని కమ్మేస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ.. వర్షం పడే తొలి కొన్ని నిమిషాల్లో కాలుష్య కణాలు నేలకు దగ్గరగా రావడం వల్ల పొగ వాసన మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
ఈ కాలుష్య గాలి వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు (COPD), గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయట ఎక్కువ సమయం పనిచేసే కార్మికులు కూడా శ్వాసకోస సమస్యలు, గొంతు మంట, తీవ్రమైన దగ్గు బారిన పడుతున్నారు.
కారణం ఇదే.. ఇంకా ముగిసిపోలేదు!
కెనడా చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత భయంకరమైన కార్చిచ్చుల సీజన్‌గా నమోదైంది. వందలాది చోట్ల అడవుల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఒంటారియోలోని వాబాకిమి ప్రావిన్షియల్ పార్క్ పరిసరాల్లోనే దాదాపు 7.88 లక్షల ఎకరాల అడవి బూడిదైపోయింది. మొత్తం కెనడా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 60 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. దీనికి తోడు అమెరికాలోని ఒరెగాన్, వాషింగ్టన్, ఐడాహో రాష్ట్రాలలో కూడా పిడుగులు పడటం వల్ల కొత్తగా అడవుల్లో మంటలు రేగాయి. మంటల తీవ్రత ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందని, ముప్పు ఇంకా ముగిసిపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications