రాహుల్ గాంధీ సమక్షంలో చిరంజీవి కాంగ్రెసు తీర్థం

చిరంజీవి కాంగ్రెసులో చేరిన సందర్భంలో రాహుల్ గాంధీ మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడడం మొదలు పెడితే అన్నా హజారే గురించి ప్రశ్నలు వస్తాయని ఆయన భావించి ఉండవచ్చునని అంటున్నారు. చిరంజీవి పార్టీలో చేరడం పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. తనకు శక్తికి మరో శక్తి తోడైతే ఆశయ సాధన సులభమవుతుందని చిరంజీవి అన్నారు. తాను కాంగ్రెసులో చేరిన సందర్భంలో సోనియా లేకపోవడం అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా శిరసా వహిస్తానని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీని రెండు సార్లు కలిశానని, ఆమె తనను ఎంతో ఆదరించారని, దీంతో సోనియా నాయకత్వంలో పనిచేయాలని తనకు అనిపించిందని ఆయన అన్నారు.
కాంగ్రెసులో చేరడం వల్ల ఉభయతారకంగా ఉంటుందని భావించినట్లు ఆయన తెలిపారు. రాహుల్ నాయకత్వం దేశానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో అవినీతి రహిత భారతదేశాన్ని చూస్తానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మనస్ఫూర్తిగా మాట్లాడారని, తనతో ప్రత్యేకంగా మాట్లాడుతానని చెప్పారని, యువతను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు కుటుంబ సభ్యుడిగా తాను గర్విస్తున్నానని ఆయన అన్నారు.
చిరంజీవి కాంగ్రెసులో చేరిన కార్యక్రమానికి గులాం నబీ ఆజాద్‌తో పాటు జనార్దన్ ద్వివేది, ఎస్ జైపాల్ రెడ్డి, అహ్మద్ పటేల్, కెవిపి రామచందర్ రావు, వి హనుమంతరావు హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, నాయకులు చిరంజీవిని అభినందించారు.












Click it and Unblock the Notifications