• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గాలి అరెస్టు వైయస్ జగన్‌ను దెబ్బతీయడానికేనా!

By Srinivas
|

YS Jagan
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు కాంగ్రెసు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే వ్యుహంలో భాగమే గాలి అరెస్టు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గాలికి, జగన్‌కు వ్యాపార సంబంధాల నేపథ్యంలో గాలిని అరెస్టు చేసి జగన్‌ను మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహంతో కాంగ్రెసు ఈ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన ధన బలంతో కర్నాటక బిజెపిలో చక్రం తిప్పుతున్న గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యం దాదాపు ఆంధ్ర ప్రదేశ్ చలువే. గాలి బిజెపిలో ఉన్నప్పటికీ ఎపిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువ కారణంగానే మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగన్, గాలి సాన్నిహిత్యం పెరిగింది.

వైయస్ మృతి అనంతరం గాలి ఓ ఇంటర్వ్యూలో వైయస్ తనకు తండ్రి లాంటి వాడని, జగన్ సోదరుడని చెప్పారు. గాలికి సంబంధించిన కంపెనీలలో జగన్‌కు, జగన్‌కు సంబంధించిన జగతిలో గాలి వాటాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాలి జగన్‌కు పూర్తిగా మద్దతు పలుకుతున్నారని గాలి బలంతోనూ జగన్ కాస్త ఎగిరెగిరి పడుతున్నాడని జగన్‌ను అడ్డుకోవాలంటే గాలిపై ముందుగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత సంవత్సరమే గాలి గనులపై కేసు నమోదయింది. జగన్‌ ఆస్తులపై ఇటీవలె నమోదయింది. మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డ గాలిపై చర్యలు తీసుకోకుండా జగన్‌పై చర్యలకు పాల్పడితే విమర్శలు ఎదుర్కొనే అవకాశముందని కూడా భావించి గాలిపై కాంగ్రెసు చర్యలకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కర్నాటకలోనూ తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న గాలి జనార్ధన్ రెడ్డిపై బిజెపి పార్టీ అధిష్టానం సైతం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రధానంగా ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ తదితరులు గాలి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

కర్నాటకలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గాలి హవా సాగుతోంది. గాలి పార్టీ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేసి తన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల గాలి వర్గం శ్రీరాములు రాజీనామా చేశారు. గాలి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఎపిలో జగన్ నుండి కాంగ్రెసుకు ఎదురైన అనుభవమే కర్నాటకలో తమకు గాలి నుండి ఎదురు కాకుండా ఉండేందుకు బిజెపి సైతం గాలి అరెస్టుకు సానుకూలంగా సంకేతాలు పంపిందనే వాదనలూ ఉన్నాయి. ఇప్పటికే ఎపిలో జగన్ కాంగ్రెసును ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక గాలి సైతం బిజెపి నుండి బయటకు వచ్చి తమకు ఇబ్బందులు సృష్టించేకంటే ముందే ఆయన నుండి బయట పడాలని బిజెపి కూడా భావించినట్లుగా సమాచారం. గాలి అరెస్టుకు బిజెపి సుముఖత వ్యక్తం చేయడం కూడా కాంగ్రెసుకు కలిసి వచ్చింది. గాలి కంపెనీల తీగ లాగి జగన్‌ను అదుపులోకి తీసుకనే అవకాశం ఉంది. ఇటు జగన్ ఆస్తులపై, అటు గాలి కంపెనీల తీగ లాగి జగన్‌ను మరింత ఇరుకున పెట్టాలనే యోచనలోనూ కాంగ్రెసు ఉన్నట్టుగా తెలుస్తోంది.

English summary
It seems, Congress going with strategy to face YSRC Party president YS Jaganmohan Reddy. Karnataka ex minister Gali Janardhan Reddy arrest is one of strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X