వైయస్సార్ ఇమేజ్ టార్గెట్, జగన్‌పై మరో దెబ్బ

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై వికీలీక్స్ బయటపెడుతున్న సమాచారం ఆశ్చర్యం కలిగించడం లేదు. అయితే వైయస్సార్ ప్రతిష్టను దెబ్బ తినేందుకు మాత్రం అవి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాలను వైయస్సార్ ఎర వేసి అవినీతికి పెంచి పోషించారని ఇంతకు ముందు వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్ బయటపెట్టగా, తాజాగా, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చూపించారని, ఆ రకంగా తెలంగాణ ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది. తెలంగాణ అనే ప్రస్తావన చేయకపోయినా సీమాంధ్రలో పోలవరం ప్రాజెక్టును చేపడుతూ, తెలంగాణలో ప్రాణహిత - చేవెళ్లకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వైయస్సార్ చూపించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమయ్యే పని కాదని వికీలీక్స్ కేబుల్స్ వివరిస్తున్నాయి. దీనివల్ల తెలంగాణ ప్రజల్లో వైయస్సార్ ఇమేజ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది.
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వైయస్సార్ ప్రతిష్ట మొత్తం వైయస్ జగన్‌కే ఉపయోగపడిందని అందరూ అంగీకరిస్తున్న విషయమే. మరో వైపు, వైయస్సార్‌ను అవినీతిరహితుడిగా, ప్రజానాయకుడిగా చూపించి వైయస్ జగన్ వర్గం రాజకీయాలు చేస్తోంది. ఈ సందర్భంలో క్రమక్రమంగా వైయస్సార్ ఇమేజ్‌పై బురద పడుతూ ఉండడంవల్ల వైయస్ జగన్ రాజకీయాలపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంది. పరోక్షంగా కాంగ్రెసు రాజకీయాలకు అది దోహదపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications