అసెంబ్లీకి రామ్మోహన్ నాయుడు? ఆ సీటుపై వైసీపీ ఫోకస్..
తెలుగుదేశం పార్టీ చరిత్రలో శ్రీకాకుళం జిల్లాకు, ఎర్రన్నాయుడు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కాలం నుంచి, ఆ తర్వాత పార్టీని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు హయాం వరకు ఆ బంధం విడదీయరానిది. చంద్రబాబు - ఎర్రన్నాయుడుల మధ్య ఉన్న స్నేహం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. పార్టీలో చంద్రబాబుకు ఎర్రన్నాయుడు ఒక బలమైన వెన్నుదన్నుగా నిలిచారు.
ఎర్రన్నాయుడి ఆకస్మిక మరణం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, తన తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారు. అటు చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఎదుగుతూనే, ఇటు పార్టీ యువనేత నారా లోకేష్‌తో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. లోకేష్ - రామ్మోహన్ నాయుడుల స్నేహం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కొత్త దిశా నిర్దేశం చేసింది. కేంద్రమంత్రిగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రామ్మోహన్ నాయుడు చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆయన రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ వైపే రామ్మోహన్ నాయుడు చూపు?
ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, రామ్మోహన్ నాయుడు అంతర్గత ఆసక్తి ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యే వైపే ఎక్కువగా ఉందనే ప్రచారం సాగుతోంది. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలనే ఆసక్తిని కనబరిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి గత ఎన్నికల్లోనే అసెంబ్లీకి పోటీ చేయాలనే అంశంపై ఆయన కుటుంబంలో తీవ్ర చర్చ జరిగింది. అయితే, ఆ సమయంలో ఆయన బాబాయ్, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సున్నితంగా తిరస్కరించడంతో.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రామ్మోహన్ నాయుడు తిరిగి ఎంపీగానే పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించి కేంద్రమంత్రి అయ్యారు. కానీ, లోకేష్ తన భావి టీమ్‌లో యువ, సమర్థులైన నేతలను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, 2029లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, రామ్మోహన్ నాయుడు స్థానంలో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.
వైసీపీకి ఇది కలిసొస్తుందా..? సీటుపై కన్నేసిన ధర్మాన, తమ్మినేని!
ఒకవేళ రామ్మోహన్ నాయుడు నిజంగానే అసెంబ్లీ బరిలోకి దిగితే, చాలా కాలంగా శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయంగా కలిసి వస్తుందా? అనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీలో ఇద్దరు సీనియర్ నేతలు ఈ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారు.
జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి, ఇప్పటివరకు కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తూ వచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఒక్కసారైనా పార్లమెంటులో అడుగుపెట్టాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయడానికి ఆయన తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు మాజీ స్పీకర్, ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం సైతం ఎంపీగా బరిలోకి దిగడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన తన మనసులోని మాటను వైసీపీ అధిష్టానానికి చేరవేశారనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
శ్రీకాకుళం గడ్డపై వైసీపీ పొలిటికల్ గేమ్!
రాజకీయంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం వైసీపీకి పెద్దగా కలిసి రావడం లేదనేది నగ్న సత్యం. జిల్లాలో బలమైన సామాజిక వర్గాల మధ్య రాజకీయ సమతుల్యతను పాటించడంలో వైసీపీ ఎప్పుడూ తడబడుతూనే ఉంది. ఈ స్థానంలో వైసీపీ చేసిన ప్రయోగాలు కూడా గతంలో ఘోరంగా బెడిసికొట్టాయి.
2014లో సామాజిక సమీకరణాలను నమ్ముకుని తూర్పు కాపు అభ్యర్థిని బరిలోకి దించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 2019, 2024లలో కాళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను మార్చినా అక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు హవా ముందు వైసీపీ ఆటలు సాగలేదు.
2029లో ఎవరి వ్యూహం పారుతుంది?
రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ ఇప్పుడే ఫోకస్ పెంచింది. కానీ, అక్కడ టీడీపీకి ఉన్న క్యాడర్ బలం, కింజరాపు కుటుంబానికి ఉన్న ప్రజాదరణ సామాన్యమైనవి కావు. ఒకవేళ లోకేష్ టీమ్ ప్రణాళికల ప్రకారం రామ్మోహన్ నాయుడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి అసెంబ్లీకి పోటీ చేస్తే.. అటు టీడీపీ కొత్త ఎంపీ అభ్యర్థిని వెతుక్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వైసీపీలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలలో ఎవరికి టికెట్ దక్కుతుంది? వైసీపీ పన్నే కొత్త వ్యూహాలు ఈసారైనా పారుతాయా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.












Click it and Unblock the Notifications