ఏపీకి వరుణుడి శుభవార్త... మూడురోజులు వర్షాలు.. ఎక్కడంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. వర్షం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు
ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా కదిలే అవకాశం ఉందని చెప్పింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానం ప్రాంతాల్లో వర్షాలు
రుతుపవన ద్రోణి కూడా ఆగ్నేయ దిశగా విస్తరించి ఉండడం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతులు, ప్రయాణికులు, సాధారణ ప్రజలు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు, గాలుల కారణంగా వ్యవసాయం, రవాణా వ్యవస్థలపై కొంత ప్రభావం పడవచ్చన్నారు. ప్రస్తుతం అల్పపీడనం వల్ల కొంత ఉపశమనం లభించవచ్చని ఆశిస్తున్నారు. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications