కెసిఆర్ వైపు తెలంగాణ - తెలుగుదేశం ఎమ్మెల్యేలు?

ఓ వైపు సకల జనుల సమ్మె జరుగుతుంటే, ఏమీ పట్టనట్లు తమ నేత చంద్రాబబు సీమాంధ్రలో పర్యటనలు చేస్తూ, సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడుతుండడం తెలుగుదేశం తెలంగాణ నాయకులను ఇరకాటంలో పెడుతోందని అంటున్నారు. తమ మానానికి తమను చంద్రబాబు వదిలేసి అధికారం కోసం కలలు కంటున్నారని తెలంగాణ నేతలు అంటున్నట్లు సమాచారం. ఈ స్థితిలో పది నుంచి పన్నెండు మంది తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు కెసిఆర్ వైపు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి సహా నలుగురు శాసనసభ్యులు పార్టీకి, శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి, తెలంగాణ నగారా పేరు మీద పనిచేస్తున్నారు. వీరు సొంత పార్టీ పెడతారా, కెసిఆర్‌తో కలిసి పోతారా అనేది తేలడం లేదు. మిగతా తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు కొంత మంది తమ దారి తాము చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో పోటీ చేయలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ప్రతిపాదనను తెలుగుదేశం తెలంగాణ ఫోరం ముందుకు తెచ్చింది. దాన్ని తెరాస ఏ మాత్రం పట్టించుకోపడం లేదు.
తాము ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేదని, ఒకవేళ ధైర్యం చేసి పోటీ చేసినా ఓటమి తప్పదని తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెరాసలో చేరడమే మంచిదని కొంత మంది అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌తో వారు మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications