తెలంగాణపై సీక్రెట్‌గా ఐబి ఆరా, కదిలిన కాంగ్రెసు

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పనితీరు నిరాశాజనకంగా ఉందని నివేదిక అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అయోమయంగా, ఆందోళనకరంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా తెలిసే పరిస్థితి లేదని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకునే నాథుడే లేడని నివేదికలో అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని తెచ్చినా పరిస్థితిలో మార్పు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎవరి కోణం నుంచి వారు పరిస్థితిని వివరిస్తుండడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐబి అధికారుల పర్యటన జరిగినట్లు చెబుతున్నారు. వారు రాష్ట్రంలోని పలు మారు మూల ప్రాంతాల్లో కూడా పర్యటించారని అంటున్నారు.
కాగా, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించబోయే నివేదికపై ఐబి నివేదిక ప్రభావం కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితి ముదురుతున్న నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానంలో కదలిక వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన రెండు మూడు రోజుల్లో సోనియాకు నివేదిక సమర్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన సోమవారంనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అర గంటకుపైగా మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిపై, తెలంగాణలో సకల జనుల సమ్మెపై, తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలపై ఆజాద్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే, తెలంగాణపై ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చించి, ఆ తర్వాత సోనియాను, సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించి తెలంగాణపై ఓ ప్రకటన చేస్తారని అంటున్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్తుండగా, ముఖ్యమంత్రి బుధవారం వెళ్తారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కొంత మంది ఢిల్లీలో మకాం వేశారు. చివరగా అధిష్టానం పెద్దలను కలిసే ఉద్దేశంతో వారున్నట్లు తెలుస్తోంది. కేశవరావు, జానా రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు తెలంగాణ ప్రతినిధులు అధిష్టానం పెద్దలతో మాట్లాడి, అక్టోబర్ 2వ తేదీ నుంచి వరుసగా రాజీనామాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కాంగ్రెసుతో సంబంధం లేకుండా ఈ నెల 28వ తేదీన రాజీనామాలు సమర్పించి, తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications