తెలంగాణపై వేడెక్కిన ఢిల్లీ, నేడే ఆజాద్ నివేదిక

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు న్యూఢిల్లీలో ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారు తెలంగాణ అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో, ప్రణబ్ ముఖర్జీతో భేటీ కోసం అపాయింటుమెంటు కోరుతున్నారు. మరోవైపు త్వరలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆజాద్ తన నివేదికను సమర్పించనున్న సమయానికి రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల కాంగ్రెసు నేతలు, పిసిసి చీఫ్, టిఆర్ఎస్ నేత, జెఏసి నేతలు అందరూ ఢిల్లీ బాట పట్టడంతో హస్తిన రాజకీయాలు బాగా వేడెక్కాయి.
ఆజాద్ తన నివేదిక కోసం ఇరు ప్రాంతాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు. ఆయన రూపొందించిన తన నివేదికలో రెండు వాదనలు బలంగానే ఉందనే చెప్పవచ్చునని ఆయన పలువురి దగ్గర చేసిన వ్యాఖ్యల ద్వారా పలువురు భావిస్తున్నారు. అయితే ఆయన ఏ నివేదిక ఇచ్చినప్పటికీ తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు తన స్టాండ్ ప్రకటించనందున ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టాండ్ తప్పనిసరిగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆజాద్ నివేదిక ఇచ్చి ఇవ్వగానే తెలంగాణ అంశంపై తేల్చక పోవచ్చునని మరి కొన్ని రోజులు పట్టవచ్చునని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఆజాద్ నివేదిక ఇచ్చాక తెలంగాణ అంశంపై తేల్చడానికి పదిహేను రోజులు పట్టవచ్చునని ఆయన చెప్పారు. మొత్తానికి రాయల తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర కేంద్రం ఏం తేల్చనుందో మరికొన్ని రోజుల్లో ఉత్కంఠకు తెరపడనున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications