పర్యటనలతో చంద్రబాబు, జగన్, బొత్స బిజీ బిజీ

జగన్ సొంత కుంపటి పెట్టుకున్నాక సుమారు 25 మంది వరకు కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన వెంట వెళుతున్నారు. చివరి వరకు ఎందరు ఉంటారు ఎందరు వెనక్కి వస్తారనే విషయాన్ని పక్కన పెడితే జగన్ అదును చూసి ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూల్చ వచ్చుననే భయం కాంగ్రెసును పట్టుకుంది. దానికి తోడు తెలంగాణ ఉద్యమం రోజురోజుకు ఉధృతం అవుతుండటంతో జగన్ దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేక పోవచ్చునని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా లేనప్పటికీ సమ్మె ఉధృతి చూస్తుంటే వారు ఏ క్షణంలోనైనా రాజీనామాలు చేసే ఆస్కారాన్ని కూడా కొట్టి పారేయలేము. మంత్రుల వరుస రాజీనామాలు, టిడిపి నుండి ఒకరి తర్వాత ఒఖరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం చూస్తున్న వారెవరూ ఉద్యమం తీవ్రతను తక్కువగా అంచనా వేయలేక పోతున్నారు.
ఉద్యమం ఓ వైపు, అదును కోసం కాచుకు కూర్చున్న జగన్ మరోవైపు. ఇక ఉద్యమం దృష్ట్యా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ సీట్లు ఖాయం. దీంతో కెసిఆర్ కూడా ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పవచ్చు. సీమాంధ్రలో జగన్ ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వెళ్లడం, తెలంగాణలో కెసిఆర్ ఉద్యమం పేరుతో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే భావనతోనే టిడిపి, కాంగ్రెసు అధినేతలు వరుస పర్యటనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు పలుమార్లు తన పర్యటనలో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరిపిన మొదటి రోజే అవిశ్వాస తీర్మానం పెడుతామని టిడిపి ఇప్పటికే హెచ్చరికలు పంపిన నేపథ్యంలో ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందోనన్న భావనతో పథకాల పేరుతో ముఖ్యమంత్రి, పార్టీ పటిష్టత పేరుతో బొత్స రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.












Click it and Unblock the Notifications