బాబుకు మరింత షాక్, బిజెపి వైపు టిటిడిపి నేతలు?

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకులు బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పలు కారణాల వల్ల కెసిఆర్‌ను వ్యతిరేకించే నాయకులు తెలంగాణలో భారీగా ఉన్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం నాయకులు కెసిఆర్‌ను నమ్మడం లేదు. కెసిఆర్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో కూడా లేరు. అయితే, వారికి ప్రత్యామ్నాయం లభించక ఇంత కాలం ఆగుతూ వస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు బిజెపి వారికి అనుకూలంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
అదును చూసి తెలంగాణ జెఎసి నుంచి తప్పుకోవడానికి బిజెపి ఎత్తులు వేస్తున్నట్లు చెబుతున్నారు. సకల జనుల సమ్మె హింసాత్మకంగా మారితే ఆ కారణం చెప్పి తప్పుకోవచ్చుననే ఉద్దేశంతో బిజెపి అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. సిహెచ్ విద్యాసాగర రావు వంటి ఒకరిద్దరు నాయకులు తెరాసతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ నల్లు ఇంద్రసేనా రెడ్డి వంటి బిజెపి నాయకులు కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బిజెపి నాయకత్వం విడిగా బలాన్ని పెంచుకోవడానికి తెలుగుదేశం నాయకులను తమ వైపు తిప్పుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ అగ్రనేత సుష్మా స్వరాజ్‌ను వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లేదా కరీంనగర్ లేదా భువనగిరి నుంచి పోటీకి దించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. దానికితోడు, అవినీతికి వ్యతిరేకంగా అద్వానీ చేపడుతున్న రథయాత్ర తెలంగాణ మీదుగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ప్రస్తుత వాతావరణం తెలంగాణలో తమకు అనుకూలంగా ఉందని బిజెపి నాయకత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications