బాబుపై వైయస్ విజయమ్మ పిల్‌లోని కొన్ని అంశాలు

హెరిటేజ్ సంస్థ చంద్రబాబుదేనని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నాశనం చేశారని పిల్‌లో విజయమ్మ ఆరోపించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీస్‌కు అక్రమంగా 14 ఏళ్ల పాటు పన్ను రాయితీ కల్పించారన్నారు. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన బాబుకు మొదట ఎలాంటి ఆదాయ వనరులు లేవని పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఆర్థిక సంస్థ రుణాలతో ఆయన ఎమ్మెల్యే కాగలిగారని ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 65 ఎకరాల బినామీ భూమి చంద్రబాబుదే అన్నారు. భుననేశ్వరి కార్బైట్స్, అలాయిస్ పరిశ్రమలోకి భారీ ఎత్తున అక్రమంగా నిధులు ప్రవహించాయని, బిజ్రూ టెక్నాలజీస్‌ను భువనేశ్వరి, లోకేష్ కుమార్ నడుపుతున్నారని ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలపలేదన్నారు.
చిత్తూరు జిల్లాలో మూడు నక్షత్రాల హోటల్ యజమాని చంద్రబాబు అని దానిని ఓ టిడిపి కార్యకర్తకు విక్రయించి ప్రతిఫలంగా కార్యకర్తను కడప జిల్లా పరిషత్ చైర్మన్ చేశారని ఆరోపించారు. 1989లోలో బాబు తన భార్య, కుమారుడు, తల్లి, బంధువుల పేర్లతో హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతంలో 3776 ఎకరాల భూమి కొన్నారని ఇన్‌పోటెక్ పేరుతో అది ఇప్పుడు రెండింతలైందన్నారు. క్యాబినెట్ రహస్యాలు ముందే లీక్ చేసి తన బంధువులు, మిత్రులు లాభపడే విధంగా చేసే వారని పిల్‌లో ఆరోపించారు. లోకేష్ కుమార్ విదేశీ చదవుకు సత్యం రామలింగరాజు రూ.22 కోట్లు ఇచ్చారని ఆరోపించినట్లుగా సమాచారం.
సుజనా చౌదరి తదితరులు బాబుకు విదేశీ ఏజెంట్లు అని, కెజి బేసిన్ హక్కులను రిలయన్సుకు ధారాదత్తం చేశారని, జయభేరీ సంస్థకు అక్రమ రాయితీలు కల్పించారని అమె పిల్‌లో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటికీ చంద్రబాబే కారణమని ఆమె అందులో ఆరోపించారు. ఆయన ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆమె పేర్కొన్నారు. కొందరి ద్వారా విదేశాలలో కూడా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించినట్లుగా సమాచారం. బాబుపై ఫెమా, మనీలాండరింగ్ తదితర పలు చట్టాల కింద విచారణ జరపాలని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications