తెలంగాణ టిడిపి నేతలకు బావామరుదులు షాక్

ఇంతకాలం తెలంగాణపై మాట్లాడని బాలకృష్ణ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. రాష్ట్రం విడిపోకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బాలకృష్ణ ఓ కార్యక్రమంలో అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, దాన్ని విడగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అవతరణకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుజాతి మూడు వేల ఏళ్ల పాటు కలిసి ఉందని, 150 ఏళ్లు మాత్రమే విడిపోయి ఉందని ఆయన చెప్పారు. ఆ రకంగా ఆయన తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చేస్తున్న ఉద్యమానికి నైతికత లేకుండా పోయిందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని, కాంగ్రెసును ఎండగట్టాలనే తెలుగుదేశం తెలంగాణ నేతలు తమ లక్ష్యాన్ని సాధించడం మాట అటుంచి, వారే ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెసు, తెరాస నాయకులు ఇంత కాలం తెలుగుదేశం తెలంగాణ నేతలపై చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది. ఏమైనా, తెలుగుదేశం తెలంగాణ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే విమర్శలను చంద్రబాబు, బాలకృష్ణ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications