జగన్ ఎమ్మెల్యేలపై అపనమ్మకం, కాంగ్రెసు నిఘా

అంతా బాగుందనుకున్న రోజుల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని, సోనియాగాంధీని బొంద పెడతామని విమర్శలు గుప్పించిన జగన్‌వర్గ నేతలంతా ఇప్పుడు మూకుమ్మడిగా వెనక్కి వచ్చేస్తున్నారు. వారిపై పలువురు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వారిని నమ్మె పరిస్థితి లేదని బాహాటంగానే చెప్పారు. ముందుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా కలెక్టరేట్‌లలో పని చేయడం కాకుండా పార్టీ కార్యాలయాలకు రావాలని హుకూం జారీ చేశారు. అయితే వీటిపై జగన్ వర్గ ఎమ్మెల్యేలు పెదవి మాత్రం విప్పడం లేదు.
కానీ అసెంబ్లీలో ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో పనుల కోసమే తాము కిరణ్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్‌కు అత్యవసరమైతే ఆ సమయంలో తాము తప్పకుండా ఆయన వెంట నడుస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జగన్‌వర్గ ఎమ్మెల్యేల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇలాంటి వారిని విశ్వసించి 2014 ఎన్నికలకు సిద్ధమైతే కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. అందుకే ఇప్పటి నుంచే ద్వితీయ శ్రేణి నేతలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications