చంద్రబాబుపై సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుదాడి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై ఎదురు దాడికి దిగారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సోమవారం రాత్రి శాసనసభలో సమాధానమిచ్చారు. ప్రపంచ బ్యాంకు అంగీకరించదు కాబట్టి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వలేమని అప్పట్లో చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తే రైతులు బాగుపడతారని తాము భావించామని ఆయన అన్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఎలా అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. చంద్రబాబు రైతుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ఆయన అన్నారు
తొమ్మిదేళ్ల పాలనలో తమది రైతు ప్రభుత్వమని తెలుగుదేశం ఏనాడూ చెప్పుకోలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ఆయన వివరించారు. జలయజ్ఞం కొత్త కార్యక్రమమని ఆయన చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను నీరు లేని ప్రాంతాలకు అందించాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపట్టామని, 86 ప్రాజెక్టులు తీసుకున్నామని, 13 ప్రాజెక్టులు పూర్తి చేశామని, 26 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో 46 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులు చేపడతామని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 2004 నుంచి వరి మద్దతు ధర 88 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. లక్ష రూపాయల వరకు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు కొత్త విషయాలు మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు ఎక్కువ కాలం ఉండే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా తాము గెలుస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఎలా దించాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధిష్టానం తనపై పెట్టిన బాధ్యతను నిర్వహించి వచ్చే రెండున్నరేళ్లు పాలిస్తామని, 2014 ఎన్నికల్లో కూడా తాము అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications