చిరు తర్జనభర్జన!, వేటు తప్పించుకున్న జగన్ ఎమ్మెల్యే

టిడిపి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. జగన్ ఎమ్మెల్యేల నిర్ణయం కూడా అదే. బాలనాగి రెడ్డి జగన్ వర్గం ఎమ్మెల్యేగా ఓటు వేసినప్పటికీ సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు వేటు వర్తించదు. దీంతో ఆయన వేటును తప్పించుకున్నారు. మరోవైపు శోభా నాగి రెడ్డి వేటుకు పిఆర్పీ తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. పిఆర్పీ కాంగ్రెసులో విలీనమైనట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. అదే సమయంలో స్పీకర్ మాత్రం ఇంకా గుర్తించలేదు. అయితే కాంగ్రెసులో పిఆర్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ తాను స్వతంత్ర సభ్యురాలిగా కొనసాగుతానని శోభా నాగి రెడ్డి గతంలోనే స్పీకర్‌కు లేఖ రాశారు.
ఓ వైపు విలీనమైనట్లు ఎన్నికల సంఘం గుర్తించడం, మరోవైపు స్పీకర్ పిఆర్పీని అసెంబ్లీలో ప్రత్యేక పార్టీగా చూడటం ఈ నేపథ్యంలో విప్ బేఖాతరు చేస్తే ఎంత మేరకు అనర్హత వేటు పడుతుందన్న దానిపై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కూడా దీనిపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను లేఖ రాసినందున వేటు పడదనే ధీమాతో శోభా నాగి రెడ్డి ఉండగా, స్పీకర్ విలీనాన్ని గుర్తించనందున విప్ వర్తిస్తుందని పిఆర్పీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. ఆయా పార్టీలు అనుసరించే విధానం, దానిపై సభాపతి తీసుకునే నిర్ణయం త్వరలో తెలియనుంది.












Click it and Unblock the Notifications