జగన్‌పైనా పోటీకి రెడీ: గర్జిస్తున్న సింహా బాలకృష్ణ

తనను నటుడిగా ఆదరించారని, రాజకీయాల్లోనూ ఆదరించాలని ఆయన కోరారు. కార్యకర్తలు, అభిమానులు వేరు కాదని ఆయన అన్నారు. సినీరంగంలో ఎన్టీ రామారావు మగధీరుడని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసి అధికార కాంగ్రెసును ఓడించిన ఘనత ఎన్టీ రామారావుదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అపహాస్యం చేస్తున్న సమయంలో తెలుగు జాతిని ఉత్తేజపరిచి, తెలుగు కీర్తిపతాకను ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహా నాయకుడు ఎన్టీ రామారావు అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకం ఆనాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నుంచి పుట్టిందేనని ఆయన అన్నారు.
బడుగు బలహీన వర్గాలను ఆదుకునే నాథుడు లేని సమయంలో ఎన్టీ రామారావు నిస్వార్థ సేవా కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల వ్యవధిలోనే కాంగ్రెసు పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారికి తగిన స్థానాలు కల్పించారని ఆయన అన్నారు. ప్రజాధనాన్ని కుటుంబ సభ్యులకు దొచిపెట్టిన నేతల విగ్రహాలు వెలుస్తున్నాయన్నారు. తాను ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోలేదని, అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరన్నారు. కొందరు నన్ను బాలుడు అన్నారని, ఐతే అలాంటి వారు తనను ఒకవైపే చూశారని రెండోవైపు ఇంకా చూడలేదన్నారు.












Click it and Unblock the Notifications