హైదరాబాద్: గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని లోకసత్తా అధినేత, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం చర్చలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కందిపప్పు ధర రూ. 100 పెరిగితే అప్పట్లో సభ్యులు గగ్గోలు పెట్టారని, కందుల ధర ఇప్పుడు రూ.30కి పడిపోతే రైతు కోసం మాట్లాడడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయ దిగుబడి వ్యయం పెరుగుతున్నా రైతు పంటకు తగిన ధర రాకుండా చూస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 29 విశ్వవిద్యాలయాల్లో 14 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లు లేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఇక విశ్వవిద్యాలయాలు ఎందుకని ఆయన అడిగారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు భారీగా విద్యుత్ కోత విధిస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఎవరికీ విశ్వాసం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేవారికే అవినీతిపై మాట్లాడే అవకాశం ఉందనే విచిత్ర వాదన వినిపిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని ఆయన అన్నారు.